• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పూజ్యులు చెప్పిన కధ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

త్రిలింగ దేశ ప్రాశస్త్యం

మన దేశంలో ఎన్నో భాషలున్నా అన్నింటిలోను తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు చెప్పి వున్నారు. అంతే కాక తమిళ దేశంలో పుట్టిన శ్రీ అయ్యప్ప దీక్షితార్ గారు ఇలా అన్నారు

ఆంధ్రత్వమాంధ్ర భాష ఆంద్ర దేశస్య జన్మభూ:
తత్రాపి యాజుషీశాఖా నాల్పస్య తపస: ఫలం” 

అనగా ఆంధ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నవారు, ఆంద్ర దేశం ఒక పుణ్యదేశం. అక్కడి ప్రజలకు దాని ఔన్నత్యం తెలియక పోవడం నిజంగా కొందరి దురదృష్టం ఆంద్ర దేశాన్ని త్రిలింగ దేశం అని పేరు. తెలుగు అనే పధం త్రిలింగ పదానికి వాడుకలో మారినది. ఎక్కడైనా ఒక ప్రదేశానికి సరిహద్దు రాళ్ళు వుండడం కద్దు. కానీ ఆంద్ర దేశ సరిహద్దులుగా మూడు లింగాలు, వాటి దేవాలయాలు వున్నాయి. దక్షిణాన శ్రీకాళహస్తి, పశ్చిమాన శ్రీశైలం, ఉత్తరాన ద్రాక్షారామం. ఇవేకాక పంచారామాలు సుప్రసిద్దాలు. ఆరామ క్షేత్రాలలో స్వామి సేద తీరుతూ ఆరామం తీసుకుంటూ వుంటారు. ద్రాక్షారామం(కోటి లింగ క్షేత్రం), అమరారామం (అమరావతి) ,కుమారారామం(సామర్లకోట), భీమారామం, క్షీరారామం. వీటిలో కొన్ని బౌద్ధాలు అని అంటారు కానీ అదంతా చరిత్రను తప్పుదోవ పట్టించడమే. ఇంతే కాక భాద్రాచల రాముడు, తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, అహోబిలం, సింహాచలం లో శ్రీ నృసింహ స్వామి, ఆహా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుణ్య క్షేత్రాలున్న పుణ్య ప్రదేశం త్రిలింగ దేశం.

పుణ్యమేమిటంటే చూడగా ఆంద్ర దేశం భక్తి సామ్రాజ్యం. పరమ శైవ క్షేత్రం. ఒక పిల్లవాడి అక్షరాభ్యాసం లో వారి చేత
ఓం నమః శివాయేతి సిద్ధంఅని మొదట వ్రాయిస్తారు. వైష్ణవులైనా మరే ఇతర గృహదేవతలు వున్నా సరే వారు తప్పకుండా పాటించే పద్ధతి ఇదిఅదే తమిళనాటఓం నమో నారాయణాయేతి సిద్ధంఅని వ్రాయిస్తారు.

అంతే కాదు వారి లిపిలో శక్తి దాగి వున్నది. తెలుగు లిపి పరాశక్తి యంత్రాలలో, ముద్రలలో అంతర్లీనంగా వుంటుంది. పరమాత్ముని స్త్రీ రూపమే పరాశక్తి. ఆవిడకు వామవ్రత పూజ శాస్త్ర ప్రామాణికం. తెలుగు లిపిలో చూసినట్టయితే అన్నీ వామ (ఎడమ) వైపుగా ఒంపు తిరిగి ప్రారంభమవుతుంది. మిగతా భాషలలో అవి కుడివైపు నుండి ఒంపు తిరుగుతాయి. ఇది పరమ శక్త్యాత్మకం. పరాశాక్తి తో అనుసందానమయి వున్నాయి. అలాగే వారి ప్రతి పదంకారం తో ముగుస్తుంది. “శివ”, “నారాయణఅకారాంతాలు. లిపిలో శక్తి, వాడుకలో శివుడు ఇది తప్పకుండా శివ శక్తుల యొక్క కలయిక. నారయణ నారాయణిల పరోక్ష రూపం. వారి భాషకు నమోవాక్కాలు. కాళిదాసు చెప్పినట్టువాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

మరొక విషయం: ఆంధ్రులలో ఎంతో మంది కృష్ణయజుశ్శాఖాధ్యాయులు. బహు కొద్ది మంది రిగ్వేదులు, శుక్ల యజుర్వేడులు వున్నా కానీ 80% మంది కృష్ణ యజుర్వేదం అభ్యసించిన వారే. యజుర్వేదం పరమ శివ సంబంధం. మొత్తం యజుర్వేదంలో మధ్యన రుద్రనమకం వున్నది. అందులో మధ్యలోనమః శివాయఅనే పరమ మంత్రం దాగి వుందిఅయ్యప్ప దీక్షితుల వారు ఆంధ్రదేశంలో ఎందుకు పుట్టలేక పోయానా అని బాధ పడ్డారు. ఎంతో తపస్సు చేస్తే తప్ప అక్కడ పుట్టే యోగ్యత లేదని నొక్కి వక్కాణించారు. ఎన్నో కారణాల వలన వారు మరొక చోటికి వలసపోయారు కానీ వారు వారి ధర్మం, ప్రేమభావం వదలరాదు. అక్కడ వున్న ప్రజలు తమ భాగ్యాన్ని తలుచుకుని మరింత నిబద్ధత తో బ్రతికి ప్రపంచానికి తలమానికం కావాలి.

సనాతన ధర్మాన్ని అవలంబించి ఆచరించి అందరూ సుఖ పడాలిహరి ఓం తత్ సత్


(జగద్గురు కంచి శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతిజయేంద్ర వాణి ప్రచురణ నుండి)

ఇంకా చదవండి »

సాధనలో భక్తిశ్రద్ధల ఆవశ్యకత

ఒక దేవాలయప్రాంగణములో ఓ సన్యాసి భగవత్తత్వముగూర్చి భక్తులనుద్దేశించి ప్రసంగింస్తూంటుంటే ఆ ప్రసంగములను అదే దేవాలయము బయటకూర్చుని భిక్షాటనము చేసే ముదుసలి అత్యంత శ్రద్ధగా వింటూ వుండేది ఆయన ప్రసంగములు ముగించి వేరే ప్రదేశమునకు బయలుదేరే రోజున ఈముదుసలి ఆయనవద్దకు వెళ్ళి

ఓ మహనీయా! నాకు వయసు అయిపోతున్నది. మీరు చెప్పే మాటలన్నీ విని నేను ఆ భగవంతుని ప్రార్ధించదలచుకున్నాను. ఆ భగవంతుని ప్రార్ధన చేయటానికి నాకు మంత్రమేదైనా దయచేసి ఇప్పించండిఅని ఆయన పాదాలమీదపడి కన్నీళ్ళు పెట్టుకుంది. సన్యాసి ఆ ముదుసలికి హే ప్రభూ !తవ పాదయే మమ శిర్ ధారయేత్, ప్రసన్న ప్రసన్న శ్రీఘ్రహ్అని స్మరిస్తుండమన్నాడు. ఆ ముదుసలి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన చెప్పినదానిని ఎల్లవేళలా స్మరిస్తువున్నది. ఇలా ఓపది ఏళ్ళుగడిచాయి. మళ్ళీ సన్యాసి ఆ దేవాలయమునకు విచ్చేశాడు. ఆయన ఈ ముదుసలిని చూసి గుర్తుపట్టి ఏం అవ్వా! నేను చెప్పినదానిని స్మరిస్తున్నావా?” 

అనడిగాడు. అందుకావ్వ తలాడించింది. ఏది పాఠం వప్పచెప్పుఅన్నాడాయన. ఆ ముదుసలి పదేళ్ళుగా తను స్మరిస్తున్న మంత్రమును ఆ సన్యాసి ముందుంచింది. అందుకాయన అయ్యో! అవ్వా! తప్పు! తప్పు! నేను చెప్పినదొకటి నువ్వుచేస్తున్నదొకటి. నేను ఆయన పాదలమీద నీశిరస్సుపెట్టమంటే, నువ్వు ఆ భగవంతుని శిరస్సున నీపాదాలు పెట్టావు. నువ్వు చేస్తున్నదంతా వ్యర్ధమయ్యిందిఅని ఆగ్రహమువెళ్ళగక్కి, తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇంతకూ జరిగినదేమిటంటే రోజూ స్మరిస్తూంటుంటే తవ” “మమఅనే పదాలు అటూఇటూ అయ్యాయి. దాంతో అర్ధము మారిపోయింది.

ఆయన చెప్పినదంతావిని ఆఅవ్వ తనుచేసిన పదేళ్ళశ్రమ వ్యర్ధమయినదని తెలుసుకొని అన్నాహారాలుమాని 
దు:ఖించసాగింది.
వైకుంఠములో శ్రీస్వామివారు ఈభక్తురాలి ఆర్తికి కరిగిపోయి ఆ సన్యాసి స్వప్నమందు కనిపించి ఓయీ! నీవు చెప్పిన మాటలకు ఆ భక్తురాలు హతాశురాలయినది. నేను భక్తిశ్రద్ధలకు బద్ధుడనుకానీ, మంత్రములకు కాదు కదా! ఆ భక్తురాలు అన్నాహారాలుమానివేయడముతో, నాకు ఎంతమంది ఎన్ని నైవేద్యములు పెట్టినా, ఆకలితీరుటలేదు. ముందు నీవుపోయి ఆభక్తురాలి అన్నపానీయములు విషయము చూడు

అని పలికాడు. ఆ సన్యాసి ఉలిక్కిపడి ఆ భక్తురాలి వద్దకువెళ్ళి ఆవిడ పాదాలమీదపడి,“తల్లీ నా అజ్ఞానాన్ని మన్నించు ! నీవు చేసే పూజయే ఆ భగవంతునికి ఇష్టమయ్యింది. నీ జన్మ సార్ధకమయ్యింది,” అని ఆవిడని శతవిధముల వేడుకొని, ఆ భక్తురాలిని సేదతీర్చి ఈ వుదంతమును తన నాటి ప్రసంగములో ఉదహరించి, ఆభక్తురాలిని కొనియాడి, సాధకులకు భక్తిశ్రద్ధలు ఎంత ముఖ్యమో తెలియచెప్పాడు.


ఈ వృత్తాంతములో భక్తిశ్రద్ధలు ఎంత అవసరమొననికానీ, ఉచ్చారణదోషములు లేకుండా చూచుకొనవలెనని సాధకులు గమనించవలసినది.

ఇంకా చదవండి »

దేవునకు ప్రథమస్థానము-పరమార్థ కథలు

అదియొక మహాపట్టణము. పట్టణ మధ్యభాగమున పురపాలకమందిరము కలదు. బ్రహ్మాండమైన సౌధమది. అందు తఱచు మహాత్ముల యొక్క ఉపన్యాసములు జరుగుచుండును. ఆ పట్టణమునకు ఏ మహనీయుడు ఏతెంచినను వారి భాషణము అచ్చోటనే ఏర్పాటు చేయబడుచుండును. కొన్ని వందలమంది చక్కగ కూర్చొని వినుటకు అచట అవకాశము కలదు.

ఒకనాడొక గొప్ప తపస్వి, విద్యావంతుడు ఆధ్యాతిక అనుభూతిని బడసినవాడు నగు మహానీయు డాపట్టణమును విచ్చేయ, ఊరి పెద్ద లాతనిని గౌరవించి, ఆదరించి నాటిరేయి ఆ పురపాలక భవనము నందు వారి ఉపన్యాసము నేర్పరచిరి. వారి భాషణమును వినుటకు ప్రజలు తండోపతండములుగ వచ్చిరి. విశాలమగు ఆ సభాభవన మంతయు జనులచే క్రిక్కిరిసిపోయెను. రాత్రి 7 గంటలకు వక్త ఇంగ్లీషులో తన ప్రసంగమును ప్రారంభించి సరిగా 8 గంటలకు ముగించెను. ముగించుటకు ముందుగా అతడు శ్రోతలందరిని ఉద్దేశించి ఇట్లె పలికెను.

"ఓ ముముక్షువులారా! జిజ్ఞాసువులారా! మీరందరునూ ఇప్పుడు శ్రద్ధాభక్తులతో కూడి ఒక గంటసేపు అనేక పారమార్థిక విషయములను గూర్చి వింటిరి. మీకందరికి అవియన్నియు జ్ఞాపకమున్నవో లేవో నాకు తెలియదు. అయినను మీ యొక్క అనుకూలముకొఱకై నేనిపుడు చెప్పిన గంటసేపు ఉపన్యాసము యొక్క సారాంశము నంతను ఒక్క వాక్యములో చెప్పెదను వ్రాసికొనుడు" - అని వచింప వెంటనే సభలో నున్న వారందరును తమ తమ జేబులలో నున్న నోటుపుస్తకములను, కలములను తీసి ఆ సారభూతమగు వాక్యమును వ్రాసుకొనుటకై సిద్ధపడిరి. అతడు ఏమి చెప్పునో యని ఒడలంతయు చెవులుచేసుకొని కాచుకొనియుండిరి. అపుడు ధర్మప్రబోధకు డిట్లు తన ఉపన్యాస సారమును ఒక్క వాక్యములో గంభీరముగ చెప్పివైచెను.

"God first, World next, Myself last" మొదట దేవుడు, పిదప ప్రపంచము, చివరికి నేను" దాని యర్థమేమనగా ప్రతిదినము నిద్రలేవగానే మొట్టమొదట దేవుని స్మరింపుము. ఆ పిదప లోకములో ఎవరికైన ఉపకారము చేయుము. ఆ తరువాతనే నీ వ్యవహారము, నీ భోజనాదులు మున్నగువానిని గూర్చి పట్టించుకొనుము.

ఈ చక్కనివాక్యమును ఉపన్యాసకుని ఆదేశము ననుసరించి సభలో వారందరును శ్రద్ధతో వ్రాసుకొని వారివారి ఇండ్లకు వెళ్లిరి. కాని ఆ సభలో ఒక్కనియొద్ద మాత్రము పుస్తకముగాని, కలముగాని లేదు. అయినను ఇంటికి వెళ్లగానే వ్రాసుకొందునని తలంచి ఆ వాక్యమును దారిలో చక్కగా మననము చేసుకొనుచు పోవుచుండెను. కాని, అదియొక మహాపట్టణ మగుటచే త్రోవలో బస్సులు ,లారీలు , బండ్లు మున్నగు వానిని తప్పించుకొని పోవలసివచ్చుటచే అతని ఏకాగ్రత కుంటు పడుచుండెను. తత్ఫలితముగ తాను వినిన వాక్యము World first, God next, Myself last - అని మననము చేయుచుండెను. తీరా, ఇంటికి చేరుసరికి త్రోవలోని విక్షేపముల వలన చిత్తైకాగ్రత ఇంకను చెడిపోగా, పుస్తకము తీసుకొని తాను వినిన వాక్యము Myself first, World next, God last - నేను మొదట, ప్రపంచము తరువాత , దేవుడు చివరికి - " అని వ్రాసికొనెను.

ఇపుడు ప్రపంచములో పెక్కురు అజ్ఞానవశమున ఇట్టి నిర్ణయమే కలిగియున్నారు. ఉదయము నిద్రలేవగనే మొట్టమొదట తన శరీరాదుల విషయమే పట్టించుకొనుచు దైవమును విస్మరించుచున్నారు. ఇది చాలా ఘోరము. తన్ను సృష్టించి, పాలించి, పోషించునట్టి హృద్గతపరమాత్మను మఱచి ప్రవర్తించుట భయంకర పాపము. కాబట్టి దైవమునకు తన నిత్య జీవితములో ప్రథమస్థాన మొసంగ వలెను. పురుపాలక భవనములో ఉపన్యాసకుడు చెప్పిన అంతిమ వాక్యము.


"దేవుడు మొదట, ప్రపంచము తరువాత, ఆఖరికి నేను" చాల సారవంతమైనది. కావున ముముక్షువు లెల్లరు ఆ కార్యమును కంటస్థము చేసి, అర్థమును మననము చేయుచు నిత్యజీవిత వ్యవహారములో అద్దానిని కార్యాన్విత మొనర్చుచు నుండవలెను. ఈ ప్రకారముగ భగవదాశ్రయము వలనను, లోకోపకారము వలనను, దేహాభిమాన రాహిత్యము వలనను, మానవునకు మహత్తరశ్రేయ మొనగూడగలదు.

ఇంకా చదవండి »

దృష్టిని పునీత మొనర్చుకొనవలెను -పరమార్థ కథలు -శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

పూర్వము తుకారాం అను పరమభక్తుడు కలడు. పండరి నాథుడగు విఠలదేవుని అతడు సదా కీర్తించుచుండెను. భజన, సంకీర్తన అనిన అతనికి పరమ ప్రీతి. జైవిఠల్ జైవిఠల్ అని నిరంతరం మాతడు విఠలనాథుని భజించుచుండెను. ఆతడు గ్రామగ్రామమున సంచరించుచు ప్రజలకు భక్తిప్రభోధము గావించుచు నామస్మరణ, భగవత్సంకీర్తనాదుల యొక్క మహిమలను ప్రజలకు తేటతెల్ల మొనర్చుచు నుండెను.

ఒకనాడతడు ఒక గ్రామమునకు విచ్చేసెను. ఆ గ్రామస్తులందరును ఆతనిని సగౌరవముగ ఆహ్వానించి ఆదరించి నాటిరేయి తుకారాం గారిచే సంకీర్తనమును ఏర్పాటుచేసిరి. తత్సంకీర్తనమును ఆలకించుటకు భజనాదులందు పాల్గొనుటకు గ్రామములోని వారు పెక్కురు వచ్చిరి. రాత్రి తుకారాం సంకీర్తనము ఆరంభించుసరికి ప్రజలు కొన్ని వేలమంది హాజరై ప్రశాంతచిత్తులై భగవన్నామామృతము యొక్క మాధుర్యమును గ్రోలుటకు ఉత్సకతను ప్రదర్శించిరి. సభయంతయు పరమ ప్రశాంతముగ నుండెను. అత్తరి తుకారాం తన సంకీర్తనమును ఉపక్రమించెను.

జనులు ఆనందపరవశు లగుచుండిరి. భగవన్నామమును బిగ్గరగా ఉచ్చరించుచు తుకారాం బ్రహ్మానందవారాశిలో నిమగ్నుడగుచుండెను. ఆ దృశ్యము వర్ణనాతీతము. ఈ ప్రకారముగ తుకారాం తన సంకీర్తనమును కొనసాగించుచుండ ఇంతలో సమయము 11 గంటలు దాటింది. సభలో ఒక్కొక్కరు లేచి తమ ఇండ్లకు పోసాగిరి. అర్ధరాత్రి యగుసరికి సగముమంది లేచిపోయిరి. కాని తుకారాం అకుంఠితదీక్షతో భగవత్తన్మయత్వములో తన భజనను కొనసాగించుచునే యుండెను. ఇంతలో తెల్లవారెను. అప్పటికిని సభలో వారందరును తత్థ్సానమును విడిచి వెళ్లిపోయిరి. ఒక్కడు మాత్రము కూర్చొనియే యుండెను.

తెల్లవారిన పిదప తుకారాం తన సంకీర్తనమును విరమించి కండ్లు తెరచి చూచుసరికి అందరునూ వెళ్లిపోయి యుండుటను ఒక్కడు మాత్రము అచట ఆసీనుడై యుండుటయు గమనించెను. వెంటనే తుకారాం ఆ కూర్చున్నవానిని తన యొద్దకు పిలిచి, "నాయనా! నీవు ధన్యుడవు! పుణ్యాత్ముడవు. ఏమియనిన, గ్రామస్థు లందరునూ వెడలి పోయినప్పటికిని, భగవన్నామ శ్రవణాసక్తిచే నీ వొకడవు ఇచటనే యుంటివి. సరియేగాని, క్రిందటి రాత్రి నేను భజనచేయు సమయమున అర్థరాత్రి వేళ సాక్షాత్‌ పండరినాథుడగు విఠలదేవుడు నా ప్రక్కనే యుండి నాతో బాటూ నృత్యము చేసెను. నివు చూచితివా?" అని యడిగెను. నేను చూడలేదని యాతడు ప్రత్యుత్తరించెను. నీ నేత్రముల కేదైన వ్యాధియున్నదా యని యడిగెను. లేదనియు దృష్టి చక్కగా నున్నదనియు అతడు జవాబొసంగెను. అట్టిచో నా ప్రక్కనేయున్న పండరినాథుని అపుడు నీవేల చూడకుంటివి? అసలు నీ వెందుల కిచట కూర్చొనియున్నావు? అని తుకారాం ప్రశ్నింప, అతడు "తమరు కూర్చొనిన చాప నాది, తమరు లేచిన పిదప దానిని తీసికొని వెళ్లు నిమిత్తమే ఇచట కూర్చొనియున్నాను" అని చెప్పెను.

అపుడు తుకారాం పరమాశ్చర్యపడి "ఆహా! జనులు ప్రాపంచిక వస్తువులపై ప్రీతిచే ప్రత్యక్షముగ నున్న భగవానుని కూడ చూడలేకున్నారు. ఈ గ్రామస్థుడు చాపపై ప్రీతిచే "చాప చాప" యని కలవరించుచు సాక్షాత్‌ దైవము ఎదుటపడి నప్పటికిని చూడజాలకుండెను. ఎంత ఘోరము! ప్రాపంచిక దృష్టిచే దైవదృష్టి మూతపడి పోయెను" అని విస్తుపోయెను. మరియు జనులకు ప్రాపంచిక పదార్థములపై గల ప్రీతిలో ఏకొంత భాగమైనను దైవము యెడల నున్నచో వారెప్పుడో మోక్షము పొందియుండెడివారు" అనియు తలంచెను.

(కాబట్టి జనులారా! దృష్టిని పవిత్ర మొనర్చుకొనుడు. నశ్వర పదార్థములపై ఆసక్తిని తగ్గించుకొని శాశ్వత పరమాత్మ యెడల ఆసక్తిని పెంపొందించుకొనుడు. భగవద్భక్తి, వైరాగ్యమును అభివృద్ధి చేసుకొనుడు అని మహనీయులు ప్రబోధించుచున్నారు.)


నీతి: దృష్టిని పవిత్ర మొనర్చుకొనవలెను. దైవదృష్టి ఆత్మదృష్టి విశాలభావము గలిగియుండవలెను.

ఇంకా చదవండి »

ఉపకారమే మానవుని స్వభావము-పరమార్థ కథలు - శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

ఒకానొక గ్రామ సమీపమున ఒక నది ప్రవహించుచుండెను. గ్రామస్థు లనేకులు ఆ నదిలో నిత్యము స్నానమాచరించు చుందురు. ఒకనాటి ప్రాతఃకాలమున ఒక సాధువు ఆ నదిలో స్నానముచేయుట కేతెంచును. అతడు పాదచారియై తీర్థయాత్ర చేయుచు సరిగా ఆ దినమున తద్ర్గామసమీపమునకు వచ్చియుండుటచే స్నానార్ధ మానది చెంతకు వచ్చెను. ఆ సమయమున గ్రామస్థు లనేకులు ఆ నదిలో స్నానము చేయుచుండిరి.

సాధువు నీటిలో దిగగానే నదీప్రవాహములో ఒక లేతు కొట్టుకొని పోవుచుండుట చూసెను. వెంటనే అతని హృదయము కరిగి దాని నెట్లైనను కాపాడవలెనని తలంచి దానిని దోసిటితో పట్టుకొనెను. తక్షణమే ఆ తేలు సాధువును కుట్టెను. ఆ బాధకు తట్టుకొనలేక సాధువు తేలును నీటిలో విడిచిపెట్టెను. నదీప్రవాహమున అది కొట్టుకొనిపోవుట చూచి సాధువు దయార్ద్రహృదయుడై మరల దానిని రక్షింపనెంచి మరల పెట్టుకొనెను. కాని ఈ పర్యాయము కూడ అది కుట్టుటచే దానిని నీటిలో వదలివైచెను. కాని మూడవ పర్యాయము దాని నెట్లైనను కాపాడనెంచి సాధువు నీటి ప్రవహములో కొట్టుకొనిపోవుచున్న తేలును పరుగెత్తి వెంబడించు చుండ, స్నానముచేయుచున్న ప్రజలు సాధువు యొక్క వింత చర్యలు చూచి అవహేళన చేయసాగిరి.

"ఓ సాధువుగారు! తేలు మీకు అపకారము చేసినది. ఒక పర్యాయము కాదు. రెండుసార్లు ఈ ప్రకారముగ అపకారము చేసిన ప్రాణిని మీరేల అవస్థపడి కాపాడదలంచుచున్నారు? మీమతి ఏమైనా భ్రమించినదా?" అని తీర్థప్రజలు సాధువును ప్రశ్నింప సాధువు అ తేలు నెట్లో కాపాడి తీరమున వైచి వారితో నిట్లనియె -

"నాయనలారా! నామతి ఏమత్రము చెడలేదు. ఆ తేలు నాకొక పాఠమును బోధించినది. తేలు యొక్క నైజము అపకారము చేయుట. మనుజుని యొక్క నైజము ఉపకారము చేయుట. తేలు తన స్వభావమగు అపకారమును వదలలేదు. అట్టిచో ఇక మనుజుడు తన స్వభావమును ఏల వదలవలయును? నైజగుణమును వదలరాదని తేలు తనచర్య ద్వారా నాకు బోధించినది. కాబట్టి మనుజులు తమ ప్రేమస్వభావమును, తమ పరోపకార భావమును ఏకాలమందును త్యజించరాదు.

'పరప్రాణులందు దయ గలిగియుండుట, చేతనైనంతవరకు పరులకు ఉపకారము, సహాయము చేయుట, దయార్ద్రహృదయులై వర్తించుట, దయాదాక్షిణ్యములను మానవకోటికే కాక జంతుకోటికి కూడ విస్తరింపజేయుట - జనులు నేర్చుకొనవలెను. ఇదియే అనుష్ఠాన వేదాంతము. ఇదియే వాస్తవ దేవతార్చన. ఇదియే సర్వేశ్వరునకు పరమ ప్రీతికరమైన ధర్మము.

ఈ ప్రకారముగ ఆ సాధువు అచట చేరిన అశేషజనావళికి చక్కని హితబోధ కావించి, వారలను ఆశ్చర్యచకితులుగను, ధర్మ మార్గావలంబులుగను గావించెను.


నీతి: మానవుని స్వభావము ఉపకారమేకాని అపకారము కాదు. కాబట్టి చేతనైనంత వరకు పరప్రాణికి మానవుడు ఉపకారమే చేయుచుండవలెను.

ఇంకా చదవండి »

ముందుచూపు -పరమార్థ కథలు - శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

ఒకానొక పట్టణము నందొక ఉద్యోగి కలడు. అతడు ఆంగ్లభాష యందు పట్టబద్రుడు. ఒకనాడతనికి దూరప్రాంత మందున్న తన బంధువుల యొద్దనుండి ఒక శుఖలేఖ వచ్చెను. బంధువులలో ఒకరి వివాహము నిశ్చయమైనందు వలన తచ్చుభకార్యమునకు వెంటనే బయలుదేరి రావలసినదిగా అతనికి వర్తమానము అందెను. తోడనే యతడు ప్రయాణమునకు సంసిద్ధుడయ్యెను. కుటుంబ సమేతముగా పయనమైపోవుటకు నిశ్చయించుకొని రైలుబండి ఎన్నిగంటలకు స్టేషనుకు వచ్చునో, ఎప్పుడు బయలుదేరునో ఆ వివరముల నన్నింటిని రైల్వేగైడు చూసి వ్రాసియించుకొనెను. రైలు సరిగా మధ్యాహ్నము 12గంటలకు స్టేషనకు రాగలదు. కావున ఒక అరగంట ముందుగానే వెళ్లి స్టేషను ప్లాటుఫారం పై కుటుంబ సమేతముగా అతడు కూర్చొనియుండెను. అంతలో అతని హృదయ ఫలకమున ఒక చక్కని సంకల్పము మెరిసెను. "రైళ్ళు సకాలమునకు వచ్చుచున్నవా? లేక ఆలస్యముగ వచ్చుచున్నవా? చూడవలెను. ఈ రోజు నేను ప్రయాణము చేయుచున్న రైలు సరిగా 12గంటలకు రావలెనుకదా! ఇపుడెన్ని గంటలకు వచ్చునో పరీక్షించెదను' అని భావించినవాడై తన చేతి గడియారముపైననే దృష్టిని కేంద్రీకరించి యుండెను.

11-30గం||లు దాటినది. 11-45 అయినది. రైలు ఇంకను రాలేదు. 11-59 అయినది. ఇంకను రాలేదు. సరిగా 12గం||లు కాగానే రైలు ఖచ్చితముగ వచ్చిప్లాటు ఫారంపై నిలిచినది, ఒక్కసెకండైనను లేడా లేదు. ఆ ఘటన చుడగనే ఉద్యోగియొక్క అనందమునకు మేరలేదు. 'ఆహా! ఈడ్రైవరు ఎంత చాకచక్యముతో, ఎంత క్రమశిక్షణతో రైలుబండిని నడుపుకొనుచు వచ్చెను! ఇట్టి అనుభవజ్ఞులగు డ్రైవర్లు ఉండినచో రైళ్ళు ఎంత చక్కగ నడువగలవు!' అని తలంచు కొనుచు,ఒక్కక్షణమైనను వ్యత్యాసము లేకుండ రైలు నడుపుచున్న ఆడ్రైవరును ప్రత్యేకముగ సత్కరించిన బాగుండునని యోచించి, వెంటనే పరుగెత్తుకొని వెళ్లి ప్లాటుఫారంపై పుష్పముల నమ్ముచుండిన ఆసామి యొద్దకేగి ఒక పెద్ద పుష్పమాలను కొని ఆడ్రైవరు చెంతకు వచ్చెను. డ్రైవరు గారికి అభివాదము సల్పి 'అయ్యా! డ్రైవరుగారూ! ఇంజనులో నుండి తమరు క్రిందకు దిగండి. తమకు సన్మానము చేయ సంకల్పించాను. తమవంటి సుశిక్షుతుడైన సారథిని ఇంతవరకు జగత్తులో నేను చూడలేదు. ఒక్క సెకండు కూడ తేడా లేక తమరు ఈ రైలుబండిని నడుపుచున్నారు. ఇది ప్రయాణ చరిత్రలోనే చెప్పుకొనదగిన విషయము. మాబోటివారు గర్వించదగిన విషయము కూడను. కాబట్టి మిమ్ములను సత్కరించుట మాయొక్క కర్తవ్యము. విధ్యుక్త ధర్మము. దయచేసి ఇంజను దిగండి. ఈ పుష్పములచే మిమ్ములను సమలంకృతులుగ చేయవలసియున్నది.

ప్రయాణికుని ఆ హర్షోత్ఫుల్లిత వచనములను ఆలకించిన డ్రైవరు ఆశ్చర్యపడి, ఆతనితో 'మహాప్రభో! క్షమించండి. నేను మీ సత్కారమును స్వీకరించుటకు యోగ్యుడను కాను. ఏలయనగా ఇది నిన్న మధ్యాహ్నం 12గం||లకు రావలసిన బండి. 24 గంటలు లేటుగా వచ్చినది' అని చెప్పివైచెను. ప్రయాణికుడు స్తబ్ధుడైపోయెను. 'రామ రామ! ఇతడు నిర్ణీత సమయమునకు 24 గంటలు వెనుకున్నాడే!' అని తలంచి హతాశుడై పోయెను.

జీవుడా! ముందుచూపు కలిగియుండుము. కథలోని డ్రైవరువలె అలసత్వము వెనుకచుపు కలిగియుండకుము. ఇప్పటికే దీర్ఘ ప్రయాణము జరిగినది. దానియందింకను విలంబనము జరుగులాగున చేయకుము. ప్రయాణమును త్వరలో పూర్తిచేసికొనుము. జనన మరణ రూప ఈ ఘోరసంసృతి నుండి శీఘ్రముగ బయటపడుము. రేపు చేయవలసిన దైవకార్యమును ఈరోజే పూర్తిచేయుము. సాయంత్రము చేయువలసిన పరమార్థ కార్యమును ఉదయముననే పూర్తిచేయుము. అలసత్వము, బద్దకము, దీర్ఘసూత్రత్వము, సోమరితనము - వీనికి ఏమాత్రము తావొంసగరాదు. ఆధ్యాత్మిక క్షేత్రమున సోమరులకు చోటు లేదు. దూరదృష్టి కలిగియుండుము. ముందుచూపు ఏర్పరుచుకొనుము. రేపు ఎట్లుండునో! కావున ఈనాడే తరించుటకు తగిన సాధనోపాయము లను అన్వేషింపుము?


నీతి: భవిష్యత్తును గూర్చి ఇపుడే ఆలోచించుకొని మృత్యువు రాకపూర్వమే ఆత్మజ్ఞానమును బడసి జన్మను సార్థక మొనర్చుకొనవలెను.

ఇంకా చదవండి »

మనసు కోయిల



ఇంకా చదవండి »

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు రచించిన వారు మనోనైర్మల్యము.

ఒకానొక పట్టణమున ఒక మహారాజు కలడు. అతనికి లెక్కలేని సంపదలు కలవు. ఆకాశము నంటుచున్న రాజప్రసాదములు పెక్కు గలవు. రాజభోగము లన్నిటిని బాగుగ అనుభవించుచు అతడు హాయిగా కాలక్షేపము చేయుచుండెను. ఇట్లుండ ఒకనా డతని కొక విచిత్ర సంకల్పము కలిగినది. తన చిత్రమును చిత్రకారులచే గీయింపజేసి అద్దానిని చూచుకొని ఆనందించవలెనను కుతూహల మాతనికి జనించెను.

వెనువెంటనే అతడు తన మంత్రిపుంగవుని పిలిపించి తనదేశమందలి చిత్రకారు లందరిని రప్పించి వారితో "ఓ చిత్రకారులారా! ఇప్పటికి మీ జీవితకాలమున ఎన్నియో చిత్రములను మీరు గీసి అఖండ ఖ్యాతిని బడసినవారైతిరి. ఇపుడు మీరు నాయొక్క చిత్రమును గీయవలసినది. నాస్వరూప మెట్లున్నదో బాగుగ గమనించి అదే విధముగ గీయవలసినది. ఏమాత్రము మార్పుఉండరాదు. ఉత్తమచిత్రమునకు సముచిత పారితోషికము ఒసంగబడగలదు.

ఆవాక్యములు వినగానే చిత్రకారు లందరు "ఓ రాజా! మా ముందు కొద్దిసేపు ఆసీనులై యుండుడు. మీ యొక్క రూపురేఖ లన్నియు మేము జాగ్రత్తగ గుర్తుపెట్టుకొందుము. ఆ తదుపరి ఇండ్లకు వెళ్ళి సావకాశముగ చిత్రమును గీసి తీసికొనివచ్చెదము" అని పలుకగా రాజు అందులకు సమ్మతించి సింహాసనముపై కొద్దిసేపు నిశ్చలముగ గూర్చుండెను. చిత్రకారులందరు తదేకదృష్టితో అతని వంక చూచుచు ముఖ్యమైన గుర్తులను కాగితముపై వ్రాసికొని వారివారి ఇండ్లకు వెడలిపోయిరి.

కొంతకాలమైన పిదప చిత్రకారులు ఒక్కొక్కరు తాము వ్రాసిన చిత్రమును తీసికొనివచ్చి రాజుకు చూపించదొడగిరి. కాని ఒక్కొక్క చిత్రము చూచినపుడు రాజు తన ముఖమందలి అంగములను ఒకింత కదల్చుచు, వికృతరూపము దాల్చుచుండ రాజుయొక్క ముఖమునకును, చిత్రకారులు చిత్రించిన ముఖమునకును సంబంధము లేకుండెను. "నా ముఖమును ఉన్నది ఉన్నట్లుగ మీరు వేయలేదు. నేను ఉన్నది ఉన్నట్లు మీరు వేయలేదు. నేను ఉన్నది ఒక రకముగను మీరు చేసినది మరియొక రకముగను ఉండుట వలన మీ చిత్రములు నాకు ఏమాత్రము సంతృప్తి కరములుగ లేవు. కావున పోయి మరల జాగ్రత్తగ వేసికొనిరండు' అని వారందరిని మందలించి పంపివైచెను.

కొంతకాలము గడచిన వెనుక చిత్రకారులు తాము ఎంతయో శ్రద్ధతో, ఓపికతో వేసిన చిత్రములను మరల తెచ్చి రాజుకు చూపించగా అపుడు రాజు పూర్వము వలెనే తన అంగములను ఒకింత మార్పు చేయుచు, కదల్చుచుండ రాజస్వరూపమునకును, చిత్రమునకును పోలికయే లేకుండెను. కావున రాజు వారందరిని మందలించి పంపివేసెను. వారు వ్రాసి తెచ్చిన ఒక్క చిత్రము కూడ పోలిక లేనందున అవి అతనికి రుచించకుండెను. ఈ విషయము తెలిసిన ఒక మహా వివేకవంతుడగు చిత్రకారుడు రాజుకు తగిన పాఠము బోధించవలెనని నిశ్చయించి ఒక అద్దము తీసికొని రాజు యొద్దకు వెళ్ళి 'రాజా! మీచిత్రమును బహురమ్యముగ గీసితిని. మీరెట్లున్నారో అదేవిధముగ చాకచక్యముతో గీసితెచ్చితిని. చూడుడు'. అని అద్దమును చూపెట్టెను.

రాజు మామూలు పద్ధతిలో తన అంగములను మార్పుచేయగా, ఆ మార్పు అద్దములో అదేవిధముగా గోచరించెను. రాజుయొక్క పప్పులు ఆ అద్దమువద్ద ఉడకలేదు. ఈ ప్రకారముగ అ చిత్రకారుడు జితోస్మి అని రాజుచే అనిపించగల్గెను. ఆ చిత్రకారుని తెలివితేటలకు రాజు చాల సంతోషించి తగినరీతి అతనిని సన్మానించి పంపివేసెను.


నీతి: అద్దము అతినిర్మలముగా నుండుటబట్టి ఎదుట నున్న వస్తువును ఉన్నది ఉన్నట్లుగా చూపును. అట్లే మనస్సును అద్దమును రజోగుణ తమోగుణ రహితముగను, దుస్సంస్కార దుర్వృత్తి వర్జితముగను నొనర్చినచో అట్టి అద్దమువంటి శుద్ధమనస్సునందు అధిష్ఠానమగు పరమాత్మ చక్కగ ప్రతిబింబించును. ప్రత్యక్షముగ గోచరించును. అదియే అత్మసాక్షత్కారము. అదియే బ్రహ్మానుభూతి. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కార రూపమోక్షమునకు నిర్మల మనస్సు అత్యావశ్యకమై యున్నది. 

ఇంకా చదవండి »

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు రచించిన వివేకోదయము

పూర్వమొకానొక పట్టణమున ఒక మహారాజు నివసించుచండెను. అతనికి అహంకారము మెండు. తన్ను మించినవారెవరు లేరను దర్పమతనికి పట్టి పీడించుచుండెను. తనవలననే లోకమున అందరికిని తెల్లవారుచున్నదను భావము అతడు గలిగియుండెను. తాను భూసురుడనని, అందరికంటె గొప్పవాడనని, పలువురితో బింకములు పలుకుచుండును. తన సంపదలు, తన భోగభాగ్యములు, తన రాజప్రసాదములు, తన ఉద్యానవనములు, తన విలాసములు చూచుకొని ఆ రాజు గర్వోన్నతిని బొందుచుండెను.

ఇట్లుండ ఒకనాడాతని దేశమునకు ఒక సాధుపుంగవుడరుదెంచెను. అతడు అనుష్ఠానపరుడు, సత్యనిష్ఠుడు, దైవభక్తి పరాయణుడు అయియుండెను. అతడు ఇహపరవిద్యల రెండింటియందును గొప్ప నిష్ణాతుడు. మంచి వాగ్ధాటికలవాడు తాను నేర్చిన బ్రహ్మవిద్యను ఇతరులకు చక్కగా చెప్పగల స్తోమత గలవాడు. ఏ విద్యయం డతడు పరిపూర్ణ అనుభూతిని బడసెనో అట్టి ఆధ్యాత్మవిద్యను లోకములో బాగుగ ప్రచార మొనర్చి అంధకారబంధురమైన ఆజ్ఞానవాతావరణ మందు నివసించుచచున్న జనావలికి జ్ఞానప్రకాశ మొసంగి కడతేర్చ వలెనను సదుద్దేశ్యమంతో అతడు ఊరూర సంచరించుచు ఉపన్యాసముల నిచ్చుచు, ధర్మబోధను వర్ణించుచుండెను. అతని పవిత్ర జీవితమును, నిరాడంబర వ్యక్తిత్వమును, అనర్గళ వాగ్ధోరణిని, అనుష్ఠాన పద్ధతులను చూచి జనులు అతని దివ్యవాణిని శ్రవణము చేయుటకై తండోప తండములుగ ఏ తెంచుచుండిరి. అతడు ఏ గ్రామమునకు వెళ్ళినను, ఏ పట్టణమున అడుగిడినను వేలసంఖ్యలో జనులు చేరుచుండిరి. ఎంతయో దూరమునుండి శ్రవణాభిలాషులై జనులు అరుదెంచు చుండిరి.

ఈ ప్రకారముగ ఒక్క సంవత్సరకాలము గడచెను. సాధువు గారి అఖండ ఆధ్యాత్మిక ప్రచారము యొక్క దివ్యప్రభావముచే ఎందరో జనులు పునీతులగుచుండిరి. పాపులు పుణ్యాత్ములుగ మారిపోవుచుండిరి. దుశ్శీలురు సచ్చీలురగు చుండిరి. దొంగలు తమ దొంగవృత్తిని మాని తమ భూతకాలిక పాపజీవితమును గూర్చి పశ్చాత్తాపడు చుండిరి. భోగులు యోగు లగుచుండిరి. వెయ్యేల దేశమంతయు రామరాజ్యముగ పరిణతి జెందుచున్నదా యనిపించుచుండెను. సాధువుగారి ఖ్యాతి దిగంతముల వ్యాపించెను.

అత్తరి ఆ దేశపు మంత్రివరేణ్యుడు సాధుమహాత్ముని కీర్తి ప్రతిష్ఠలకు అచ్చెరువొంది, అతని గుణగణములను మిక్కిలి శ్లాషించి, అతనిని ఆహ్వానించి రాజుచే సన్మానము చేయించిన బాగుండునని తలంచి ఆ విషయమున రాజున కెరింగింప ఆతడందులకంగీ కరించెను. ఒక పుణ్యదినమున ఆ అమాత్యశేఖరుడు రాజుగారి తరపున ఆహ్వానపత్రమును గైకొని సాధువుగారి ఆశ్రమమునకు వెళ్లి అతనికి భక్తిపురస్సరముగ సమర్పించి, రాజనగరమునకు వేంచేయులాగున భూపాలుని తరపున అభ్యర్థించెను. అందులకు సాధుపుంగవుడు తన సమ్మతిని తెలుపగా వెంటనే మంత్రివర్యుడు ఒక రథముపై వారిని ఆసీనులుగ జేసి మేళతాళములతో రాజప్రసాదమునకు గొనిపోయెను. రాజ భవనమున ప్రవేశించిన సాధుమహాత్ముని నృపాలుడు గౌరవపుర స్సరముగ లోనికి తీసికొనిపోయి సముచితమగు ఉన్నతాసనముపై గూర్చుండబెట్టి వివిధరీతుల సన్మానించెను.

ఇదియంతయు మంత్రియొక్క ప్రోద్బలముచే జరిగినదే గాని రాజునకు స్వతః ఆ మహనీయుని గౌరవించవలెనను ఉద్దేశ్యము లేదు. తన్ను మించినవారు జగత్తులో లేనేలేరను అహంభావము కలవాడు ఒకరిని గౌరవించుటకు ఉద్యుక్తుడగునా? అయినను మంత్రిపై గల సదభిప్రాయమువలన రాజు ఆతని మాట తీసివేయలేక సాధుమహాత్ముని సత్కరించెను.

ఇంత గౌరవము తనకు జరుగుచున్నను సాధువు ఆ సన్నివేశమును గొప్పగ తలంచలేదు. దైవమందే మనస్సు నెలకొల్పుకొని బాహ్యదృష్థి లేనివాడై యుండెను. తన్ను సత్కరించుచున్న రాజుపై గాని, తాను ఆసీనుడైయున్న నానాలంకార శోభితమణిమయ దివ్యాసనముపై గాని, నవరత్నములతో తులతూగుచున్న రాజభవనము పై గాని అతడు తన దృష్టిని పరచక కేవలము భగవత్పాదార విందములందే దానిని సంలగ్నము చేసెను. కాని అహంభావ ప్రపూరితుడగు ఆ భూపాలుడు పరిస్థితిని అపార్థము చేసికొని, సాధువు తన్ను కించపరెచనని భావించి పట్టరాని ఆగ్రహావేశముతో కూడినవాడై తత్‌క్షణమే సైనాధికారిని పిలిపించి "ఓయీ! దేశమునకు ప్రభువైన నన్ను ఈ సాధువు ఉపేక్షచేసి అవమానపరచెను. కాబట్టి ఈతనిని దేశమునుండి బహిష్కరించి వేయు" మని ఆజ్ఞాపించెను.

రాజుయొక్క ఆ శిక్షాశాసనమును వినగానే సాధువు పకపక నవ్వెను. ప్రకనున్నవారందరు ఆశ్చర్యచకితులైరి. రాజునకు గూడ పరమాశ్చర్యము గలిగి "సాధువుగారూ! శిక్ష విధించగనే మీరేల నవ్వినారు?' అని ప్రశ్నింప అందులకు సాధువిట్లు విజ్ఞతా పూర్వకముగ సమాధాన మొసంగెను - "ఓ రాజా! చిన్న దేశమునకు ప్రభువైన నిన్ను ఒక్క క్షణకాలము ఉపేక్షించినపుడే నాకు దేశబహిష్కారణయను ఇట్టి కఠినదండన లభించగా, ప్రభువులకు ప్రభువై, రాజులకు రాజైనట్టి పరమాత్మను జీవితమంతయు ఉపేక్ష చేసిన నీకు ఎట్టి గోరమగు దండనము లభించునో" యై తలంచుకొని నాకు నవ్వువచ్చినది.

ఆ వాక్యమును వినగానే రాజునకు కనువిప్పు కలిగెను. తాను ఒక చిన్న దేశమునకు రాజైనను రేపో మాపో నశించి పోవు నాలుగు మూరలు అస్థిపంజరము కలిగియున్నను వానిని జూచుకొని మరిసిపోయి, అహంకరించి, బ్రహ్మాండమునకు ప్రభువైన శాశ్వతుడై నట్టి పరమాత్మను విస్మరించుట చాల పొరపాటని గ్రహించి, తన తప్పిదమును గుర్తెరింగి సాధువు గారి పాదపద్మములపై తన శిరస్సునుంచి క్షమాపణ వేడుకొని తనకు చక్కని బోధను ప్రసాధించినందులకు, తన నేత్రములను తెరపించినందులకు తనకు వివేకోదయము కలిగించి అంధకారమయమగు తన జీవితమునకు ప్రకాశమందజేసి నందులకు అతనిని వేనోళ్ల పొగడి, తగురీతి సత్కరించి పంపెను.


నీతి: ఎవరును తమతమ సంపదలను జూచుకొని గర్వించరాదు, క్షణికజీవితము గొప్పనితలంచి ప్రభువులకు ప్రభువైన భగవంతుని విస్మరించరాదు. శాశ్వతుడైన పరమాత్మకు వినిర్మలభక్తి భావముతో జోహారు లర్పించి, వినమ్రులై నిరంతర దైవచింతనతో గూడుకొని, జీవితమును పవిత్రముగ నొనర్చుకొనవలెను.

ఇంకా చదవండి »